అవతారమూర్తి - ఆదిశంకరులు
అనుదినమూ శివపూజా సమయమున మన మీ క్రింది శ్లోకమును పఠింతుము.
ఆపాతాళ సభస్థలాంతభువన బ్రహ్మాండ మావిస్ఫుర
జ్ఞ్యోతిస్స్ఫాటికలింగమౌళి విలనత్ పూర్ణేందువాంతామృతైః,
అస్తోకాప్లుత మేక మీశ మనిశం రుద్రాను వాకాన్ జపన్
ధ్యాయే దీప్సితసిద్ధయే ధ్రువపదం విప్రో భిషించే చ్ఛివమ్‌ః
ఈ శ్లోకము పరమేశ్వరుని స్వరూపమును వర్ణించి పూజాసమయమున చేయవలసిన జపమును, దేవుని ధ్యానించవలసిన రీతిని, ఆ ధ్యానఫలమును తెలుపును. సర్వేశ్వరుడు ఆపాతాళ సభస్థలాంతు-హతాళమునుండి ఆకసమువరకు వ్యాపకుడై యున్నాడు. అతడు కాలాతీతుడు, నిరవధికుడు, ఆదిమధ్యాంతరహితుడు, అంతర్బాహ్యముల అవిచ్ఛిన్నముగా వెలిగెడు పరిపూర్ణమూర్తి , జ్యోతిస్వరూపి, పూర్ణేందు శేఖరుడు, మన అభీప్సితములు నెరవేరుటకై ఆయనను స్ఫటికలింగమున అభిషేకసమయమున పై రీతిని ధ్యానించవలెను.
స్ఫటికలింగము దొక విశేషము గమనించదగినది. గ్రాహ్యమగు వస్తువును స్థూలముగ నర్థము చేసికొనుటకు మనమొక చిహ్నము నుపయోగింతుము. ఆత్యంతములు లేని అనాదిని-పరమేశ్వరుని, ఏ ప్రతీకమందు చూచుట? అది చదరముగనో దీర్ఘ చతురస్రముగనో ఉండగూడదు. అట్టి ప్రతీకమునకు ఆత్యంతములుండును. కానీ వర్తులమునకు స్ఫుటమగు ఆద్యంతములు లేవు. అదుచేతనే ఈశ్వరచిహ్నము శివలింగము-గుండ్రముగా నుండుట.
లింగము స్ఫాటికముగ నుండుటలో కూడా ఒక అర్థమున్నది. మన మేలింగమును పూజచేసినను, మనస్సున అవి స్ఫటికము లనియే భావించదగును. స్ఫటికము బ్రహ్మమువలె శుద్ధమైనది, అది నిష్కళంకము, నిరంజనము, శుభ్రము. శివలింగమును ఏ వర్ణపు పుష్పముతో, పత్రముతో అలంకరింతుమో ఆ వర్ణమునే ప్రసరించును. ఆ రంగును ప్రతిబింబించును. స్వతహా దానికి రంగులేదు. భక్తు డేరంగుల వస్తు సంచయముతో పూజ చేయునో లింగమును అవేరంగులను ధరించును. అదేరీతిని ఈశ్వరస్వరూపము త్రిగుణాతీతము. కాని సాధకుని మనోభావమును అనుసరించి సత్త్వరజస్తమో గుణాకృతులను దాల్చినట్లు కాననగును.
పరమేశ్వరుడు, ఆహ్లాదకరుడగు అమృతకిరణుని శిరమున దాల్చియున్నాడు. ఈ శిరోభూషణమునకు అనుగుణ్యముగా స్ఫటికలింగమును సంతతక్షీరధారచే పూజా సమయనస్నానము చేయింపదగును. అభిషేకసమయమున యజుర్వేదాంతర్గతమగు రుద్రమును పఠింపతగును. చమకప్రశ్నమున 'శంచమే మయశ్చమే' యనియు, శ్రీరుద్రమున 'శంభ##వే మయోభువే, శంకరాయ, మయన్కరాయ' యనియు నున్నది. శం, శంభు శంకర, మయః, మయోభూః, మయస్కర-అనిన అర్థమేమి? ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగ వ్యాఖ్యానింతురు. వేద మంత్రములకు వివిధార్థము లుండుట సరికాదు. వానికంతయు ఒక్కటే అర్థము. వేదముల పరమ తాత్పర్యమును గూర్చి శ్రుతి యీ క్రింది విధముగా చెప్పును.
సర్వే వేదా యత్పద మామనంతి
తపాంసి సర్వాణి చ య ద్వదంతి|
య దిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి
తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి||
సర్వవేదములకు ఏది అంతిమమో, తపస్సు దేనికి దారితీయునో, సాధకులు దేనినికోరి బ్రహ్మచర్యము చేయుదురో అట్టి పరమోన్నతస్థితిని నేను నీకు సంగ్రహముగా చెప్పుదును అని నచికేతునితో యముడనును. ఆయన సంగ్రహముగా చెప్పినది: ' ఓ మిత్యేతత్' అను వాక్యము. ఆ పరమపదమును ఓంకారము సూచించును. ఓంకారమునకు వివరణము: మాండూక్యోపనిషత్తున - ''సర్వం హ్యే తద్ర్బహ్మ-అయమాత్మా బ్రహ్మ-సోయ మాత్మా చతుష్పాత్'' అనియు ప్రథమావస్థ- జాగృతియు, ద్వితీయావస్థ- స్వప్నమును, తృతీయావస్థ-సుషుప్తియు, చతురము-పూర్ణమును. అంతిమమును అగు తురీయమని చెప్పబడినది. తురీయమును గూర్చి ఉపనిషత్తు, అదృష్టము, అవ్యవహార్యము, ఆగ్రాహ్యము. అలక్షణము, అచింత్యము, అవ్యపదేశ్యము, ఏకాత్మప్రత్యయసారము, ప్రపంచోపశమము, శాంతము, శివము, అద్వైతము అని పలికి 'స ఆత్మా విజ్ఞేయః' అనియు వక్కాణించును. కనుక వేదముల అంతిమలక్ష్యము- ఓంకారము. అదియే వాజ్మనసాతీత మగు పరబ్రహ్మము. 'ఏకమీవా ద్వితీయం బ్రహ్మ' అని శ్రుతి. శంకరులును దశశ్లోకియందు దీనినే యీ క్రింది విధముగా చెప్పిరి.
న చోర్ద్వం న చాధో న చాంత ర్న బాహ్యమ్
న మధ్యం న తిర్య జ్న పూర్వా పరా దిక్,
వియద్వ్యాపకత్వా దఖండై కరూప
న్త దేకో వశిష్టః శివః కేవలో7హమ్||
న జాగ్రన్న మే స్వప్నకో వా సుషుప్తిః
న విశ్వో న వాతైజనః ప్రాజ్ఞకో వా,
అవిద్యాత్మకత్వాత్ త్రయాణాం తురీయః
త దేకో వశిష్టః శివః కేవలో7హమ్||
ప్రథమ శ్లోకమున ఈశ్వరుని సర్వవ్యాపకత్వమును, అఖండత్వమును సూచింపబడినది. శాంతము, శివము, అద్వైతము అని చెప్పబడు పరబ్రహ్మము సాధకుల ధ్యానార్థము పూజార్థము, ఆపాతాళ సభస్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫురజ్జ్యోతిగ - శివస్వరూపముగా చెప్పబడుచున్నది.
సాధారణముగా - ఏ వస్తువునకైనను ముఖ్యభాగము కేంద్రమున స్థాపితమైయుండును. ఉదాహరణముగా శ్రీరంగములోని ఆలయమును దీసికొందము. అందు సప్తప్రాకారములు ప్రతి ప్రాకారమందును ఎన్నియో విగ్రహములు. ఆలయమునకు మూలవిగ్రహమేది యనివెదకునపుడు ఇతరుల సాయములేకయే ఆలయమునకు కేంద్రమున ఏవిగ్రహము స్థాపితమైయున్నదో అదియే మూలవిగ్రహమని నిర్థారింతుము. గర్భగుడిమీదనే ముఖ్య విమానము నిర్మించియుందురు. కనుక ఏ వస్తువుకైనను నడుమ చెప్పినది, కేంద్రమున, పలికినది అతిముఖ్యము. వేదముల ముఖ్యోపదేశ##మేమి? వేదములను 'త్రయీ'యని యందురు. వేదత్రయములగు ఋక్, యజు, స్సామములలో యజుర్వేదము మధ్యనున్నది. ఇందు సప్త కాండములు, సప్త కాండములకు నడుమ నాలుగవ కాండము ఆ నాలుగవ కాండ మధ్యభాగము పంచాక్షరీ మంత్రము. 'శివ' ఇత్యక్షరద్వయమ్-అందుచే వేదశీం్షమగు ఓంకారమును వేదమధ్యమున వెలిగెడి శివశబ్దమును రెండును ఆ పరబ్రహ్మమునే గుర్తించును.
ఓంకారమును, ఏకరూపమును అగు పరబ్రహ్మ స్వరూపమునకే 'శంభు' అని ధ్యానపూజాదుల నొసర్తురు. ఆయనయే ఆపాతాళ సభస్థలాంతవ వ్యాపించిన ప్రభువు పూజాదికముల గ్రహించు ఆపరమశివుడే శంభుడనియు శంకరుడనియు తెలియబడును. మనము 'శంభ##వే, మయోభువే, శంకరాయ, మయస్కరాయ' యని పరబ్రహ్మమును గూర్చి చెప్పుదుము. అదే పరబ్రహ్మను వేదములు 'శాంతము, శివము, అద్వైత' మని వర్ణించును, శంకరవిజయములను గ్రంథములలో భగవత్పాదుల జీవితచరిత్ర వర్ణితము. అందు ఆదిశంకరులు విరాట్స్వరూపుడగు పరమశివుని అవతారమేయని చెప్పబడినది.
''మూర్థని హిమకరచిహ్నం
నిటలే నయనాంక మంనయో శ్శూలమ్,
వవుషి స్ఫటిక సవర్ణం
ప్రాజ్ఞా స్తం మేనిరే శంభుమ్||''
శంకరులు శిశువుగ నున్నపుడు ఆయన శిరమున చంద్రుని చిహ్నముండెడిదట. నిటలమున నేత్రచిహ్నమట. భుజములయందు శూల చిహ్నమట. వారిదేహము స్ఫాటిక చ్ఛాయలతో వెలిగిపోయెడిదట.
అజ్ఞానాంతర్గహనపతితా నాత్మవిద్యోపదేశైః
త్రాతుం లోకాన్ భవదవశిఖాతాప సాపచ్యమానా9,
ముక్త్యా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి
శంభో ర్మూర్తి శ్చరతి భువనే శంకరాచార్యరూపా||
శంకరాచార్య రూపమున భువనమున తిరుగునది శంభుమూర్తియే. వటవృక్షమూలమువదలి మౌనమును త్యజించి అజ్ఞానారణ్యమున చిక్కిన వారును, భవతప్తులును అగు మానవానీకమును రక్షించుటకై ఆత్మవిద్యోపదేశమును చేయుచూ తిరుగులాడెడి శంకరాచార్యులు సాక్షాత్ దక్షిణామూర్తియే యని దీని తాత్పర్యము. ఇట్లు శంభువు శంకరుడాయెను. శ్రుతిలోని శంభువవు, శంకరుడు అను ఈ పదద్వయము ఒకే పరమాత్మను సూచించును. 'శంభుశబ్దమునకు సంభావయతి-ఉత్పాదయతి ఇతి శంభుః' అనియు శంకరశబ్దమునకు 'శంకరోతి ఇతి శంకరః' అనియు వివరణము, ఆనందమునకు మూలము శంభువు ఆనందమును లేక సుఖమును కల్గించెడివాడు శంకరుడు. ఆనందమూలమును మనము వెదకికొనుచు పోవలెను. కాని 'శంకరోతి' యనునపుడు ఈశ్వరుడు తన యునికిని వదలి ఆనందమును నాలుగుచోట్లకు కొని తెచ్చి ఆనంద పిపాసువులకందజేయును. మనమొక అరణ్యమున దప్పికొన్నప్పుడు జలాశయమునకై అన్వేషింతుము. కాని నది తన జన్మస్థానమునుండి జలవాహికమై పిపాసార్తులకు నీటిని తానుగ గొని తెచ్చును.
ఇచట మరికొన్ని గమనించదగిన విషయములున్నవి. శ్రుతి శంభువును వర్ణించునపుడు 'కపర్దినేవ్యుప్త కేశాయ' యని చెప్పును. కపర్ది యనగ జటలను దాల్చినవాడని అర్థము. శంభువును స్థాణువనియు, మౌనియనియు చెప్పుదురు. వట వృక్షచ్ఛాయలలో మౌనియై స్థాణువై అచలుడై ఆయనకూచుండును. ఆయన ఆనందమునకు మూలము, యోగమార్గమున గాని, తపోమార్గమునగాని ఆయనను మన మన్వేషించదగును. ఆయనకడకు మనము వెళ్ళవలెను. కానీ శంకరులట్లు కాదు నిత్యసుఖమును ఆయన మనమున్న కడకుదెచ్చి పడవైచి వెళ్ళును. మన వాకిలికి ఆయనయే అరుదెంచును. అజ్ఞాన గహనమున చిక్కిన మనలను చూచిన ఆయనకు అంతటిదయ.
శంభువు కపర్ది, జటాధారి శంకరులన్ననో వ్యుప్తకేశులు. కేశముండను గావించుకొన్నవారు. శంభువు స్థాణువు. అచలుడు. వటవృక్షచ్ఛాయలలో అసీనుడు. కానీ శంకరులు 'లోకాం స్త్రాతుం చరతి' ఒక్క చోటున నిలువక యత్యాశ్రమమున లోకములను కాపాడుటకై సన్యాసియై తిరుగులాడును. శంభువు మౌని, శంకరులు ఉపదేశకులు ఆత్మవిద్యోపదేశమును చేయుదురు.
శంకరులు నాలుగాశ్రమములలో యత్యాశ్రమము నేల గ్రహింపవలెను? నాలుగు ఆశ్రమములందు సన్యాసమే దేశభ్రమణకు అనుకూలము. బ్రహ్మచారి గురువుకడ అంతే చోటునుండి మరొక చోటునకు పోవుట అనునది యుండదు. గృహస్థు డన్ననో తన భార్యాబిడ్డల యోగక్షేమముల గమనించుచు అతిధులను అభ్యాగతులను ఆదరించుచు ఇంటికడనే యుండును. వానప్రస్థుడు అడవులకేగి తపోధ్యానములలో కాలము గడపును. కాని సన్యాసి నిలకడలేక ఏ ఒక్కచోటునను మూడురాత్రులమించి గడపక చరించుచునే యుండును. అందుచే వేదాంతోపదేశమునకు సన్యాసాశ్రమమే అత్యుత్తమ మైనదని శంకరులు గుర్తించి సన్యాసియై అజ్ఞానములో మునిగిన మానవానీకమునకు సరియగు మోక్షమార్గమును చూసెను.
ముందు చెప్పిన మంత్రమున 'మయశ్చ నమోమయోభువే, నమో మయస్కరాయ'- అను పదము లున్నవి. మయః అను పదమునకు మనము అర్థము తెలిసికొనవలెను. మయన్ యనగా మోక్షసుఖము. మయః ''సుఖం భావయతి ఇతి మయోభూః'', ''ఆచార్యశాస్త్రాదిరూపేణ మోక్షసుఖం కరోతి ఇతి మయస్కరః'' మయన్ అనగా నిత్యసుఖము, ఈ నిత్యసుఖము నుత్పానచేయువాడు మయోభూః. మయస్కరుడు ఈ నిత్యసుఖమును దెచ్చియిచ్చెడివాడు. 'యద్వైశివం త న్మయః' అని యజుర్వేదము. 'శాంతం శివం అద్వైతమ్' అని చెప్పబడు ఆ పరబ్రహ్మమే 'మయః.'
ఈ నిత్యసుఖమును అందుకొనవలెనని శాంతి అవసరము. అదియే మన నైతిక- ఆధ్యాత్మిక సాధనలకు అంతిమ ఫలము. వృక్షములకు షడ్రసములు కలవు. అవి ఆవ్లు లవణ కటు కషాయతిక్త మధురములు, వృక్షములో ఫలించెడు ఫలములకు సహిత మీరసములే. వృక్షము ఫలోన్ముఖమై ఫలించుటయే దాని పరిపూర్ణదశ, కాయలు ఫలించిన పిదప వృక్షమునకు వేరు పరిణామముగాని, అభివృద్ధిగాని యుండదు. షడ్రసములలో కడపటిది మధురరసము. ఏకాయయయినను సరే- ఫలించిన మధురమగును. చేదగు వేపకాయలు సైతము ఫలించినపుడు చేదుపోయి యించుక తీపికిదిగును. కాని కొన్ని ఫలములు వెఱ్ఱితీపి.
ఫలములలోని షడ్రసములవలెనే మనః పరిణామమును గూర్చి పలుకునపుడు నవరసములని వ్యవహరింతురు. అవి శృంగార వీర కరుణాద్భుత హాస్య భయానక భీభత్స రౌద్ర శాంతరసములు అన్నిటికీ కడపటిది శాంతము.
ఆవ్లులవణరసాదులెట్లు మధురమున లయించుచున్నవో అటులనే శృంగార వీర కరుణరసాలు శాంతమున లయించి పరిపూర్ణత నొందును. శాంతి పక్వమైన మనఃస్థితికి చిహ్నము మనస్సు వృత్తిరహితమైనచో శాంతినొందును. బాహ్యవిషయ సంపర్కముచే కలుగు మనో వ్యాపారములోని మార్పులు నవరసములు సూచించును. అడవిలోనొక పులిని చూచిన తోడనే మనిషి భయకంపితుడగును. సౌందర్యముచే నుద్దీపించునొక మగువను చూచి పురుషుడు కామ వివశుడగును. ఏ స్థితియందు మగువ సౌందర్యము కామమునుగాని, వ్యాఘ్రదర్శనము భీతినిగాని కల్గింపదో అదియే శాంతము. ఆ స్థితి యందు వస్తుదర్శనముగాని, వస్తుస్మృతిగాని ఎట్టి మనోవికారమును గల్గించదు. ఆస్థితి మనస్సుయొక్క అసంగత్వమును స్వచ్ఛతను తెలుపును. సత్త్వ రజస్తమోగుణముల ననుసరించి మనోవృత్తుల మార్పులను గ్రహించదగును. ఇందు సాత్విక చిత్తవృత్తి ఉత్తమము. సాత్త్విక చిత్తవృత్తి వృద్ధి అయినదనిన తక్కిన రెండుగుణములు జరస్తమముల వృత్తులు క్షీణించిన వని యర్థము. కాని యీ సాత్త్విక చిత్తవృత్తిని సైతము నిరోధించవలెను. అపుడే శాంతి, ఈశాంతి చేతనే మయన్ అనెడు నిత్య సుఖమును అందుకొనగలము. 'మయోభూః' అనియు, 'మయస్కరః' అనియు వర్ణింపబడిన శంకరులు యతియై దేశాటనము గావించి రక్షణకును విమోచనమునకును కారకులైరి.
మనమందరము ఈ శాంతిని సాధించవలెను. ఈ శాంతి నందుటయే మోక్షము. ముక్తుడు సంసారమునుండి విడివడును. అతనికి మరుజన్మయనునదిలేదు. 'తమేవం విద్వానమృత ఇహభవతి' యని శ్రుతి. ఈ లోకమునందే యీ జీవితమునందే ముక్తి నందునని దీని తాత్పర్యము. ఈ శ్రుతి జీవన్ముక్తిని గూర్చి ముచ్చటతించుచున్నదిగాని విదేహముక్తిని గూర్చి కాదు.
మరణసమయమున మన మనోవృత్తులు అనగా మనో వ్యాపారములు ఎట్లుండునో వాని ననుసరించి మనుష్యునకు మరుజన్మ కలుగుచున్నదని శాస్త్రములు చెప్పుచున్నవి. విదేహముక్తియే సత్యమైనచో మరణానంతరము శాంతినొంది తద్ ద్వారా ముక్తి నందవలెను. కాని చావునకు ముందులేని శాంతి చచ్చినతర్వాత ఎట్లువచ్చును? కావున ముక్తి కాములు జనననివృత్తి కొరకు ప్రయత్నించెడివారు. ఈ జీవితముననే బ్రహ్మజ్ఞానమునొంది తద్వారా శాంతినందవలెను. శ్రుతిలోని 'ఇహభవతి' యనుటకు అదియే అర్థము. 'ఇహ' అను పదమే భగవద్గీతలోని యీ క్రింది శ్లోకమున వాడబడినది.
''శక్నోతిహైవ యః సోఢుం ప్రాక్‌శరీర విమోక్షణాత్,
కామ క్రోధోద్భవం వేగం న యుక్త్‌ః స సుఖీ నరః||
ప్రాక్ శరీ విమోక్షణాత్స్‌శరీరమును వదలిపెట్టుటకు మునుపే కామ్రకోధోద్భవ వేగమును వహించి ఇహ జీవితముననే శాంతి ద్వారా మోక్షము నందవలెనని భగవానుడి బోధచేయును.
నిత్యసుఖము శాంతి స్వరూపము. దానికై మనము అనుదినమును యత్నించవలెను. విషయసుఖములపై మనస్సును మళ్ళనీయక అనవరతము కడు జాగరూకతతో ఇంద్రియముల నియమ మొనర్పవలెను. దానికి మార్గములు రెండు నిరతసాధన యొకటి. నిత్యధ్యానముచే లబ్దమగు పరమాచార్యుని దయ రెండు.
ఏ విద్యకైనను గురువు ననుగ్రహము, శిష్యుని అభ్యాసము రెండు ముఖ్యమైన అంగములు, శిష్యునికి దైవమందెంత భక్తియుండునో అంత భక్తియే గురువునందు సైతము ఉండవలెను. లేనిచో మనస్సున కొక అనాదర మేర్పడును. గురువునే భగవత్స్వరూపముగ భావింపవలెను. గురువులు సాధారణులైన అట్టి మనోభావమును (అనగా భగవత్ స్వరూపులను భావమును) కల్పించుకొనవలెను. కాని మన ఆచార్యులకడ అభావము స్వభావసిద్ధముగ అయత్నముగా కల్గుచున్నది. శంభువే శంకరుడుగ అవతరించెను. వారు సాక్షాత్ శంకరులే. అందుచే మనకు సులభముగా వారియందు భక్తి జనించును. మన మనస్సును, మనోవృత్తులను నిరోధించి మన ఆచార్యుల కడ భక్తి ప్రపత్తుల నెరపినచో మనకు ఈ జీవితమునందే ముక్తి సులభసాధ్యమగును.
చాలమంది తమ జీవితములను వృధా యొనర్చు కొందురు. మోక్షాన్వేషణ మే గొప్పధీమంతులకోగాని సాధానణులకు గాదని వారి అభిప్రాయము. ఇది మిథ్యాశంక. తప్పు అభిప్రాయము. స్వల్పమైనను- కొంచెము సాధనచేసి యయినను- చిత్తశుద్ధి నొందుటకు యత్నించిన- అంతవరకు మన మెంతయో ధన్యులము. ఆచేసిన కొంచెము మరుజన్మకు మూలధనమగును. మోక్షమునకు పెట్టుబడియగును. అందుచే పురుషయత్నముచేసి ఆచార్యుల దయ సంపాదించుట మన కందరకును విధి. అపుడే మనకు ఉత్తమపుణ్యగతి గల్గును.
|